లప్పానాయక్ తండా  భూనిర్వాసితులకు అండగా ఉంటాం : ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య భరోసా

లప్పానాయక్ తండా  భూనిర్వాసితులకు అండగా ఉంటాం : ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య భరోసా

​యాదగిరిగుట్ట, వెలుగు: గత బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో ఇండ్లు, భూములు కోల్పోయిన లప్పనాయక్ తండా భూనిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటూ పూర్తి న్యాయం చేస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య భరోసా ఇచ్చారు. యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్ తండా, రాళ్లజనగాం గ్రామాల్లో శుక్రవారం ఉదయం అధికారులతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించిన ఆయన అనంతరం భూనిర్వాసితులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.

వైఎస్సార్ హయాంలో 0.8 టీఎంసీలతో ప్రారంభమైన బస్వాపూర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వార్థంతో 11 టీఎంసీలకు పెంచి, నిర్వాసితులకు కనీస పరిహారం, పునరావాసం కల్పించకుండా తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే దాతరుపల్లి గ్రామ శివారులో లేఔట్ పూర్తి చేసి 314 ప్లాట్లను సిద్ధం చేసిందని, ఈ నెల 27న డ్రా పద్ధతి ద్వారా వాటిని కేటాయిస్తామని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి బాధితులకు ప్రత్యేకంగా 300 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.